అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించింది. లక్షల రూపాయలు కాజేసి పరార్ అయింది. మాయలేడి కోసం విజయవాడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మైలవరం, విజయవాడ నగరంలోని పలువురు ఈ మాయలేడి బారిన పడి లక్షల రూపాయలు మోససోయారు. హైకోర్టులో ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ పేరుతో రమాదేవి అనే మహిళ మోసాలకు పాల్పడింది. రమాదేవితో పాటు ఆమె కొడుకు, కూతురు మోసంలో భాగం పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరిపై పెనమలూరు పోలీసులు సస్పెక్ట్ షీట్ తెరచారు. ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ పేరుతో పలువురి నుండి దాదాపు 72 లక్షలు కాజేసి రమాదేవి పరారైంది.
మైలవరం పట్టణానికి చెందిన ఓ మహిళ వద్ద నుంచి రియల్‌ఎస్టేట్ వ్యాపారం పేరిట 28 లక్షల రూపాయలు మాయమాటలు చెప్పి కాజేసింది. అంతే కాదు బాధితురాలిపై దాడి చేశారు. దీంతో పెనమలూరు, సత్యనారాయణపురం, మైలవరం పిఎస్ లలో రమాదేవిపై కేసులు నమోదయ్యాయి. ఇక పెనమలూరుకు చెందిన ఓ నిరుద్యోగికి హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ. 24 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మాయమాటలతో అమాయకులను మభ్యపెడుతూ లక్షలు కాజేసి, పరారీలో ఉన్న రమాదేవి, ఆమె కుటుంబం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు పెనమలూరు పోలీసులు. మాయలేడి హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. త్వరలోనే ఆమెను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.