సెల్ఫీ.. ఈ పిచ్చితో చాలా మంది తమ ప్రాణాలమీదకు తెచ్చుకున్న వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం… తాజాగా ఓ యువతి కూడా సెల్ఫీ సరదాతో ప్రాణాలను పోగొట్టుకుంది. తుపాకీతో సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని హార్డోయిలో జరిగింది ఈ హృదయవిదారక ఘటన. 25 ఏళ్ల రాధికా గుప్తా అనే యువతి తన తండ్రి వద్ద ఉన్న బారెల్ తుపాకీతో సెల్ఫీ దిగే క్రమంలో గన్ పేలి.. బుల్లెట్ ఆమె తలలోకి దూసుకుపోయింది. రాధికా తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో అతని దగ్గరున్న లైసెన్సుడ్ తుపాకిని.. ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సమయంలో పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పాడు. తిరిగి జూలై 22 న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ తుపాకిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆ తుపాకీతో సెల్ఫీ దిగేందుకు రాధికా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కెమెరా బటన్ నిక్కబోయి తుపాకీ ట్రిగ్గర్‌ను నొక్కింది. అంతే బుల్లెట్ ఆమె తలలోకి దూసుకుపోయింది. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
రెండో అంతస్తులో గన్ శబ్దం రావడంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో రాధికా శవం పడిఉంది. ఆమె మృతదేహం పక్కన సెల్‌ఫోన్ పడిఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆసమయంలో కెమెరా ఆన్ చేసి ఉండటంతో ఆమె సెల్ఫీ తీసుకునే క్రమంలో చనిపోయిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. అయితే అత్తమామల వేధింపుల కారణంగానే రాధికా ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని ఇక్కడ చదవండి :