Young Lady became a Hijra for Marriage: హిజ్రాగా మారితే పెళ్లాడతానన్న మహిళ మాటలు నమ్మిన ఓ యువతి మోసపోయింది. హిజ్రాగా మారాక సదరు మహిళ పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఈ దారుణ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు ప్రభుత్వ అధికారులు. శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే శిక్షణలో ఉన్న మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఇరువురికి వివాహం కాలేదు. అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. మంచి స్నేహితులుగా మారారు. సదరు యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని.. పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది. ఆమె మాటలు నిజమేనని నమ్మిన యువతి హిజ్రాగా మారింది.
కాగా, ఇద్దరు కలిసి కొంతకాలం జీవించారు. ఈ క్రమంలో హిజ్రాను పెళ్లాడతానంటూ మహిళ చెప్పింది. కుటుంబసభ్యులను ఒప్పించి చేసుకుంటానని నమ్మించింది. అయితే, ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సదరు మహిళ ముఖం చాటేసింది. వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పిడంతో వారు అంగీకరించలేదు. మహిళను నిర్బంధించారు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని, న్యాయం చేయాలని యువతి కడప జిల్లా పోలీసులను ఆశ్రయించింది. మహిళపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ఎలా పరిష్కరించాలని పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.
Read Also..