ఓ పాస్టర్ తనను నమ్మించి మోసం చేశాడని రాజమహేంద్రవరంలో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సినీ నటి కరాటే కల్యాణి సాయంతో బాధితురాలు రెండోపట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్‌తోట సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి వచ్చేది. అక్కడి పాస్టర్ ఎన్‌జే షరోన్ కుమార్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీస్తే నగ్న వీడియోలు బయట పెడతానని.. బయటికి చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ ఎదుట కరాటే కల్యాణి మాట్లాడుతూ.. హైదరాబాద్ వచ్చిన బాధితురాలు ఇటీవలే తనను కలిసిందని, ఆమెకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.