పెళ్లి చేసుకుని నూతన జీవితంలో అడుగుపెడుతున్న వరుడిపై విధి కన్నెర్ర చేసింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. తన కలలను నెరవేర్చుకునే దిశగా ముందుకు వెళ్తున్న ఆ యువడిపై పగబట్టింది. వివాహం చేసుకున్న కొన్ని గంటల్లోనే తన ఒడికి చేర్చుకుంది. ఉదయపు నడకకు వెళ్లిన నవవరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోడ్డుపై పడి ఉన్న యువకుడిని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నంద్యాల(Nandyal) జిల్లా వెలుగోడు మండలంలోని బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్.. జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన శిరీష అనే యువతితో శుక్రవారం వివాహమైంది. మార్నింగ్ వాక్ కు వెళ్తున్నానని చెప్పి ఇవాళ(శనివారం) తెల్లవారుజామున బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు.
శివ కుమార్ కోసం చుట్టుపక్కలా వెతికారు. ఈ క్రమంలో బోయరేవుల – మోత్కూరు గ్రామాల మధ్య రోడ్డుపై శివకుమార్ పడి ఉండడాన్ని గుర్తించారు. శివ కుమార్ లో ఎలాంటి చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిత్స కోసం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు శివకుమార్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శివ కుమార్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వాహనం ఢీ కొట్టిందా.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లయిన కొద్ది గంటల్లోనే ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.