కాపురంలో ఫేస్‌బుక్ చిచ్చు.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
సభ్య సమాజంలో రానురాను మానవత్వం మంటగలుస్తోంది. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో భార్య.
సభ్య సమాజంలో రానురాను మానవత్వం మంటగలుస్తోంది. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట న్యూఇందిరానగర్‌కు చెందిన మహ్మద్ నాసర్(31) సమీప బస్తీకి చెందిన హలీమాబేగం అలియాస్ గౌసియా(27)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. గగన్‌పహాడ్‌లోని పెట్రోలు బంకులో పనిచేస్తున్న నాసర్ కుటుంబం ప్రశాంతంగా సాగుతుండగా ఫేస్‌బుక్ వారి కాపురంలో చిచ్చుపెట్టింది.
గౌసియాకు పహాడీషరీఫ్‌కు చెందిన షేక్ బిలాల్ హుస్సేన్(22)తో ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సంభాషణలు కొనసాగి… అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త నాసర్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో ఏమాత్రం మార్పులేదు. పైగా భర్త అడ్డు తొలగించుకోవాలని గౌసియా భావించింది. శనివారం రాత్రి హుస్సేన్‌తో కలిసి భర్తను దిండుతో నొక్కి, తాడుతో గొంతు బిగించి హతమార్చింది. తరువాత అత్త మరియంబేగం ఇంటికెళ్లి.. గుర్తుతెలియని వ్యక్తి నాసర్‌ను గొంతు నులిమాడని చెప్పింది. మరియంబేగం ఘటనా స్థలానికి చరుకొని స్థానికుల సాయంతో కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అనుమానం వచ్చిన నాసర్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందుతులను అదపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.