Wife and relatives attack on husband: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం సర్వసాధారణమే.. ఇలాంటి సందర్భాల్లో దంపతుల్లో ఏ ఒక్కరు అర్థం చేసుకోకపోయినా.. గొడవలు పెద్దవిగా మారుతుంటాయి. దీంతోపాటు ఈ గొడవల కారణంగా భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం.. ఆ తర్వాత పెద్దలు భార్యాభర్త ఇద్దరి మధ్య రాజీ కుదర్చడం జరుగుతుంటుంది. ఎక్కువసార్లు పంచాయతీల్లో భర్తనే పెద్దలు సముదాయించి.. రాజీకి ఒప్పిస్తారు. అయితే.. ఇక్కడ మొత్తం సీన్ రివర్స్ అయింది. ఎన్ని పంచాయతీలు పెట్టినా.. ఓ వివాహిత మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. భర్తతో తెగదింపులు చేసుకునేందుకే మొగ్గుచూపుతూ భర్తకు చుక్కలు చూపిస్తోంది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. భర్తతో గొడవపడి ఓ వివాహిత పెట్టింటికి వెళ్లిపోయింది. నెలల తరబడి అక్కడే ఉండటంతో ఇద్దరి గొడవలు తారాస్థాయికి పెరిగాయి. అనేకసార్లు భార్య భర్తపై ఫిర్యాదు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇద్దరికి సర్థిచెబుతూ పరిష్కారం చేస్తూ వచ్చారు.
అయితే.. తాజాగా భార్య.. ‘‘నీతో కలిసి ఉండలేను నాకు తలాక్ ఇచ్చేయ్ లేకపోతే నేనే నీకు ఖులా ఇస్తాను.. అంగీకరించు’’ అంటూ హెచ్చరించింది. దీనికి అంగీకరించాలంటూ భార్య పరానా బేగం భర్త ఆరిఫ్‌పై కొన్ని రోజుల నుంచి ఒత్తిడి తీసుకువస్తోంది. అయితే.. ఈ సమస్య చివరకు ఖాజీ వరకు చేరింది. ఆరిఫ్‌ను ఖాజీ దగ్గరకు పిలిపించి భార్య పరానా బేగం కుల కాగితాలపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి చేసింది. చివరకు భర్త సంతకాలు చేసిన తర్వాత భార్య, ఇతర కుటుంబ సభ్యులు.. ఆరిఫ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో భర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం ఆరిఫ్ ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్.
Also Read: