క్రూర ఘటన: కోతిని కుక్కలతో కరిపించి, ఉరేసిన నీచులు.. వీడియో వైరల్‌

నోరు లేని జీవాల పట్ల అమానుష ఘటనలు ఆగడం లేదు. తమ పైశాచికత్వాన్ని మూగజీవాలపై చూపిస్తూ రాక్షసానందం పొందుతున్నారు కొంతమంది నీచులు

క్రూర ఘటన: కోతిని కుక్కలతో కరిపించి, ఉరేసిన నీచులు.. వీడియో వైరల్‌

Edited By:

Updated on: Jun 29, 2020 | 8:59 AM

నోరు లేని జీవాల పట్ల అమానుష ఘటనలు ఆగడం లేదు. తమ పైశాచికత్వాన్ని మూగజీవాలపై చూపిస్తూ రాక్షసానందం పొందుతున్నారు కొంతమంది నీచులు. తాజాగా నీళ్ల కోసం వచ్చిన కోతిని పట్టుకొని కుక్కలతో కరిపించి, ఉరేశారు మానవ రూపంలో ఉన్న రాక్షసులు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. మానవత్వం మంట కలిసి పోతుందన్న దానికి ఇదో మరో ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెంలోకి ఈ నెల 26వ తేదీన ఓ కోతి దండు వచ్చింది. వాటిని సాధు వెంకటేశ్వరరావు, జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతి కలిసి తరిమారు. ఆ క్రమంలో ఓ  కోతి నీరు తాగేందుకు ప్రయత్నించి తొట్టెలో పడిపోయింది. దాన్ని పట్టుకున్న ఆ ముగ్గురు చెట్టుకు వేలాడదీశారు. ఒక కోతిని చంపేస్తే మరోసారి కోతులు ఆ ప్రాంతానికి రావడానికి భయపడుతాయని.. దాన్ని చెట్టుకు ఉరేసి కుక్కలతో కరిపిస్తూ, కర్రలతో కొట్టి చంపారు. ప్రాణాల కోసం అది విలవిల లాడుతుంటే అక్కడున్న వారు క్రూర నవ్వును నవ్వారు. ఆ తరువాత శివారు ప్రాంతంలో కోతి మృతదేహాన్ని పడేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఫారెస్ట్ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. కోతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన సాధు వెంకటేశ్వరరావు, జోసెఫ్‌ రాజు, గౌడెల్లి గణపతిలను అరెస్ట్ చేశారు. విచారణ తరువాత ముగ్గురిపై కేసు నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున జరిమానా విధించారు. అయితే ఇంతటి క్రూర ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.