వికాస్ దూబే కేసులో 200 మంది పోలీసులపై దర్యాప్తు

| Edited By: Pardhasaradhi Peri

Jul 07, 2020 | 4:50 PM

యూపీలో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసు కాన్పూర్ పోలీసులకు పెను సవాలుగా మారింది. ఎనిమిది మంది ఖాకీలను పొట్టనబెట్టుకున్న ఇతనికి ఎంతమంది పోలీసులతో సంబంధాలు ఉన్నాయో తెలుసుకుని పోలీసు ఉన్నతాధికారులే..

వికాస్ దూబే కేసులో 200 మంది పోలీసులపై దర్యాప్తు
Follow us on

యూపీలో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసు కాన్పూర్ పోలీసులకు పెను సవాలుగా మారింది. ఎనిమిది మంది ఖాకీలను పొట్టనబెట్టుకున్న ఇతనికి ఎంతమంది పోలీసులతో సంబంధాలు ఉన్నాయో తెలుసుకుని పోలీసు ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు. కాన్పూర్ లోని చౌబేపూర్, బీహౌర్, కక్వాన్, శివరాజ్ పూర్ పోలీసు స్టేషన్లకు చెందిన సుమారు 200 మందికి పైగా పోలీసులపై దర్యాప్తు జరుపుతున్నట్టు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. చౌబేపూర్ పోలీసు స్టేషన్ లో ప్రస్తుతం పని చేస్తున్నవారితో బాటు గతంలో పని చేసిన పోలీసులు కూడా దూబే వల్ల ఏదో విధంగా ప్రయోజనం పొందినవారేనని తెలుస్తోందన్నారు. దూబే పారిపోవడానికి వీరిలో చాలామంది సహకరించినట్టు భావిస్తున్నామన్నారు.

చౌబేపూర్ పోలీసు స్టేషన్ కి చెందిన పది మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి వారి స్థానే రిజర్వ్ పోలీసు లైన్స్ నుంచి పదిమందిని అక్కడ నియమించారు. ఇదిలా ఉండగా కొంతమంది బీజేపీ నేతలతో బాటు తనకు స్థానిక రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉందంటూ వికాస్ దూబే 2017 లో ప్రకటించినట్టు.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాడు ఇతడిని పోలీసులు అరెస్టు చేసి.. ఇంటరాగేట్ చేశాక అతడు  బాహాటంగా ఈ ప్రకటన చేశాడట. తనను ఖాకీలు అరెస్టు చేయడానికి వస్తే భగవత్ సాగర్, అభిజిత్ సంగా అనే బీజేపీ నేతలు, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు తనను కాపాడారని దూబే పేర్కొన్నాడట.  అయితే యధాప్రకారం… ఈ హిస్టరీ షీటర్ తో తమకు ఎలాంటి లింక్ లేదని ఈ బీజేపీ నాయకులు ఖండించారు.