Woman kills her 3 kids: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన గొడవలు నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో కలహాలతో విసిగిపోయిన ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోర సంఘటన మహోబా జిల్లాలోని కుల్‌పహడ్ ఏరియాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్‌పహడ్‌కు చెందిన కల్యాణ్, సోనమ్ ఇద్దరు భార్యభర్తలు. ఈ దంపతులకు విశాల్ (11), ఆర్తి (9), అంజలి (7) అనే ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఈ మధ్య దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీనిపై పంచాయతీ సైతం నిర్వహించి ఇరువురి కుటుంబసభ్యులు ఇద్దరికీ నచ్చజెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మళ్లీ గొడవ జరిగింది. దీంతో భర్త కల్యాణ్ బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో సోనమ్ ముగ్గురు పిల్లల గొంతు కోసి దారుణంగా చంపింది. అనంతరం తాను కూడా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అనంతరం భర్త కల్యాణ్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్య, పిల్లలు విగతజీవులుగా కనిపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. సంఘటనా స్థలంలో రక్తపు మరకలతో కొడవలి లభించినట్లు సర్కిల్ ఆఫీసర్ (CO) సదర్ తేజ్ బహదూర్ సింగ్ తెలిపారు. అనంతరం భర్త కళ్యాణ్‌ను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే.. సోనమ్‌కు భర్త కళ్యాణ్‌పై అనుమానాలు ఉన్నాయని, అతని వేరే మహిళతో సంబంధం ఉండటంతో ఆమె కలత చెందిందనని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సదర్ తేజ్ వెల్లడించారు.
Also Read: