Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫతేపూర్‌లోని చౌరాసి ప్రాంతంలో వేగంగా దూసుకువచ్చిన ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి రెండు బైక్‌లను, సైకిలిస్ట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. బైక్‌లు, సైకిల్‌ను ఢీకొట్టిన అనంతరం ఎస్‌యూవీ చెట్టును ఢీకొట్టి.. ఆ తర్వాత కలిమిట్టి దబౌలి గ్రామంలోని ఓ గుంతలో పడిపోయిందని ఎస్పీ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఇక్కడ మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.
ఈ సంఘటనలో మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారే ముగ్గురు ఉన్నారని.. రాకేశ్ (35), అతని తండ్రి రాజారామ్ (65), రితిక్ (5)గా గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరిని ఆశిష్ (25), సౌరభ్ (38)గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఎస్‌యూవీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని, అతన్ని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50వేల ఆర్థిక సాయంతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Read Also…. Black Pepper : మిరియాల ఘాటు ఆరోగ్యానికి మంచిదే..! ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సరైన మార్గం..