Unnao Girls Death Case: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ముగ్గురు బాలికలు పొలంలో విష ప్రయోగానికి గురై తనువు చాలించిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలతో తిరిగే మరో యువకుడే నిందితుడిగా తేలింది. ముగ్గురిలో ఇద్దరు చనిపోగా ఒకరు కాన్పూర్ ఆస్పత్రిలో విషమ పరిస్థితులలో చికిత్స పొందుతుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుడు విజయ్ ఈ ముగ్గురు బాలికలకు లాక్‌డౌన్‌లో పరిచయం ఏర్పడింది. వీరంతా పశువుల మేపడం కోసం పొలానికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు కబుర్లు చెప్పుకునే వారు. ఈ క్రమంలో వినయ్ ముగ్గురు బాలికల్లో ఒకరిని ప్రేమించాడు. అనేకసార్లు ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ సదరు బాలిక అంగీకరంచలేదు. కోపం పెంచుకున్న వినయ్ ఎలాగైనా బాలికను అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో వినయ్ తన స్నేహితులతో కలిసి సదరు బాలికను చంపేందుకు ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా తన ఇంటిలో ఉన్న పురుగుల మందును తీసుకెళ్లి నీళ్ల బాటిల్ కలిపాడు. ఆ తర్వాత తినుబండారాలు, పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్ తీసుకుని బాలికల దగ్గరకు వెళ్లాడు.
రోజులానే నిందితుడు వినయ్, మిగతా బాలికలు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వినయ్ తన దగ్గర ఉన్న పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్‌లోని నీటిని తను ప్రేమించిన అమ్మాయి చేత తాగించాలని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది ముగ్గురు అమ్మాయిలు ఆ నీటిని తాగారు. కాసేపటికే బాధితులంతా స్పృహ తప్పి పడిపోయారు. ఊహించని ఈ ఘటనకు భయపడిని వినయ్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు. అయితే దర్యాప్తులో పోలీసులకు అక్కడ సిగరేట్ పీక, వాటర్ బాటిల్ కనిపించింది. ఆ తర్వాత మిగతా వారిని ప్రశ్నించగా వినయ్ పాత్ర బయటకు వచ్చింది. దాంతో పోలీసులు కాల్ డీటెయిల్ రికార్డ్(సీడీఆర్) టెక్నిక్ ద్వారా వినయ్ ఈ దారుణం జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన దారుణం గురించి వెల్లడించాడు. ఇక తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఉరి తీయాల్సిందిగా బాధిత బాలికల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.