Friend Killed: ‘‘ధనం మూలం.. ఇదం జగత్’’.. అన్నింటికీ డబ్బే మూలం అని తెలుగులో నానుడి. దీని ప్రకారమే ఆధునిక ప్రపంచం పరుగులు పెడుతోంది. ఎలాంటి బంధాలైనా డబ్బుతోనే ముడిపడుతున్నాయి.. డబ్బుతోనే అంతరించిపోతున్నాయి. చివరకు డబ్బు.. ప్రాణాలను సైతం తీస్తూ.. అనేక రకాల సమస్యల సృష్టిస్తోంది.. అనడానికి ఈ దారుణ ఘటన ఉదహరణగా మారింది. తాజాగా రూ.500 కోసం స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం.. ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారం గ్రామానికి చెందిన జగడం విఠల్, తోట జయకృష్ణ, జగడం గంగారాం స్నేహితులు. వీరు ఈ నెల 4వ తేదీన (బుధవారం) మల్లారం కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగారు. అయితే జగడం విఠల్ దగ్గర జయకృష్ణ గత కొన్ని రోజుల క్రితం రూ.500 అప్పుగా తీసుకున్నాడు. తాగిన మత్తులో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని విఠల్.. జయకృష్ణతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఘర్షణ జరిగింది. తోట జయకృష్ణతో పాటు జగడం గంగారాం.. మత్తులో విఠల్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలైన విఠల్ కల్లు కంపౌండ్‌లోనే స్పృహ తప్పి పడిపోయాడు.
అనంతరం స్థానికులు విఠల్ పరిస్థితిని గమనించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతన్ని వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో విఠల్.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: