పొట్టకూటి కోసం స్వంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు వచ్చారు. సొంత ఊరికి వేల కిలో మీటర్లు దూరంలో పనికి కుదిరారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై మృత్యువు కన్నెర్ర చేసింది. కన్నవాళ్ల కళ్లముందే కన్నబిడ్డలను కబళించింది. గంటల వ్యవధిలోనే చిన్నారులిద్దరూ మృత్యు ఒడికి చేరారు. వారు ఎలా చనిపోయారనేది వైద్యులకూ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. క్షణాల వ్యవధిలోనే బిడ్డలిద్దరూ చనిపోవడంతో.. వారి మృతదేహాలను హత్తుకుని తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. తాము చూస్తుండగానే పిల్లలు ఇద్దరూ మృత్యువాత పడటంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండెలు పిండేసే ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానకి చెందిన రమేష్ దాస్ బతుకుదెరువు కోసం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చాడు. స్థానికంగా ఉన్న శ్రీకాళహస్తి పైప్స్ కర్మాగారంలో కాంట్రాక్ట్ సూపర్‌వైజర్‌గా పనిలో చేరాడు. గతేడాదిగా భార్య నీలం కుమారి, పిల్లలు హేనా, రోషన్ కుమార్‌తో కలిసి రాచగున్నేరిలో నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం వేకువజామున 3 గంటల సమయంలో కుమార్తె హేనా అస్వస్థకు గురైంది. ఊపిరాడటం లేదని చెప్పడంతో హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ హేనాను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందిందని చెప్పారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు.
మరోవైపు కుమారుడు రోషన్ కుమార్ పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారింది. వెంటనే అప్రమత్తమైన రమేష్ దాస్.. బైక్ పై కుమారుడిని ఏరియా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆసుపత్రికి వెళ్లిన కాసేపటికి రోషన్ మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే, తాము చూస్తుండగానే పిల్లలు ఇద్దరూ మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది. జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారుల మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచదవండి.