Murdered Case: దడ పుట్టిస్తున్న గొంతులు కోసే నరహంతక ముఠా.. పోలీసులకు సవాల్‌గా మారిన జంట హత్య కేసు

|

Dec 04, 2021 | 7:30 PM

Murdered Case: కొన్ని కొన్ని హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు జంట హత్యల కేసు పోలీసులు తలమునుకలవుతున్నారు...

Murdered Case: దడ పుట్టిస్తున్న గొంతులు కోసే నరహంతక ముఠా.. పోలీసులకు సవాల్‌గా మారిన జంట హత్య కేసు
Murder
Follow us on

Murdered Case: కొన్ని కొన్ని హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు జంట హత్యల కేసు పోలీసులు తలమునుకలవుతున్నారు. ఈ జంట హత్యల కేసు ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్నాయి. గత నెల నవంబర్‌ 20వతేదిన ఇంకొల్లు మండలం పూసపాడులో వృద్ధ దంపతులను గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే శుక్రవారం టంగుటూరులో తల్లీ, కూతుళ్ళను అత్యంత దారుణంగా గొంతుకోసం హత్య చేశారు దుండగులు. అనంతరం ఒంటిపై బంగారు నగలతో ఉడాయించారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు పూసపాడు వృద్ద దంపతుల హత్య కేసు మిస్టరీ వీడకుండానే అదే తరహాలో టంగుటూరులో బంగారు నగల వ్యాపారి ఇంట్లో తల్లీకూతుళ్ళు హత్యకు గురవడంతో పోలీసులు ఈ రెండు కేసులను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ రెండు కేసులకు ఏదైనా లింక్‌ ఉందా..? అన్న కోణంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ళ హత్యలు దొంగలు చేసినవిగానే భావిస్తున్నారు పోలీసులు. అయినా సరే ఇతరత్రా కారణాలపై కూడా దృష్టిపెట్టామని చెబుతున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామంటున్నారు.

టంగుటూరులో తల్లీ కూతుళ్ళ గొంతు కోసిన నరరూప రాక్షసులు..

ప్రకాశంజిల్లా టంగుటూరు నడిబొడ్డులో, పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జరిగిన తల్లీ,కూతుళ్ల జంట హత్యల సంఘటన కలకలం రేపింది. జనావాసాల మధ్య సాయంత్రం 8 గంటల ప్రాంతంలో బంగారువ్యాపారి రవి ఇంట్లోకి జొరబడిన దొంగలు బంగారం వ్యాపారి జలదంకి రవికిశోర్‌ భార్య శ్రీదేవి (43), కూతురు లేఖన (21)లపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఒంటిపై నగలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. రవికిషోర్‌ సింగరాయకొండ రోడ్డులో ఆర్‌.కె.జ్యుయెలర్స్‌ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన రాత్రి 8.20 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూసేసరికి భార్య, కుమార్తె గొంతుకోసిన స్థితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశారు.

వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లేఖన ప్రస్తుతం బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ హత్యలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. రవికిషోర్‌ సోదరుడు రంగాకు చెందిన బంగారు ఆభరణాల దుకాణంలో మూడు నెలల క్రితం సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన రవికిషోర్‌ భార్య, కుమార్తె హత్యకు గురికావడంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ

టంగుటూరులో జంట హత్యలపై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వారింటిని జిల్లా ఎస్పీ మలికగార్గ్‌ పరిశీలించారు‌. సంఘటన జరిగిన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడారు. టంగుటూరులో స్థానిక మహిళలతో సంఘటన జరిగిన సమయంలో నిందితులను ఎవరైనా చూశారా అంటూ అరా తీశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నామని, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని అన్నారు. ఈ జంట హత్యల కేసును చేధించేందుకు ప్రతేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

సరిగ్గా 15 రోజుల క్రితం వృద్ధ దంపతుల గొంతు కోసిన కిరాతకులు..

మరోవైపు పదిహేను రోజుల క్రితం ఇదే తరహాలో ఇంకొల్లు మండలం పూసపాడులో వృద్ధ దంపతులను గొంతుకోసి దారణంగా హత్య చేసిన సంఘటనతో టంగుటూరు జంట హత్యల కేసుకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పూసపాడులో హనుమంతరావు (72), రామతులశమ్మ (65) దంపతులు ఊరి చివరలోని ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్‌ వేసుకుని నివసిస్తున్నారు. వీరిని గుర్తు తెలియని వ్యక్తలు గొంతుకోసి హత్య చేశారు. అనంతరం ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్ళారు. ఈ హత్యలు ఎవరు చేశారన్నది మిస్టరీగా మారింది. తాజాగా టంగుటూరులో జరిగిన జంట హత్యల నేపధ్యంలో పూసపాడులో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసుతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు..

టంగుటూరులో పోలీసు స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఈ సంఘటన జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హత్యకు గురైన తల్లీకూతుళ్ళను పలువురు పరామర్శించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేవలం అరగంట వ్యవధిలో తమ సొంతింట్లోనే తల్లీకుమార్తెలు హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా దుండగులు. వారిని హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంది. అసలేం జరిగిందన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇదే టంగుటూరులో మూడు నెలల క్రితం మృతుల కుటుంబానికి చెందిన బంధువు రంగా బంగారం షాపులో 800 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ కేసు ఓ కొలిక్కి రాకముందు రంగా సోదరుడు రవి భార్య, కూతురు దారుణ హత్యకు గురికావడంతో ఈ రెండు కేసులు లింకేమైనా ఉందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్బంగా కొండపి టీడీపీ నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు తమకు పాతకక్షలు కానీ, ఎవరిపై అనుమానాలు లేవని హత్య గురైన శ్రీదేవి భర్త రవి చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Crime News: ఎంతపని చేశావమ్మ.. ముగ్గురు పిల్లలను దారుణంగా చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..

Shilpa Chowdary Cheating Case: కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో కొత్త ట్విస్ట్.. తెరమీదకు మరో పేరు..