Crime News : ఆ కుటుంబాన్ని విధి వంచించింది.. వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాలు తీరని శోకాన్ని మిగిల్చాయి. భార్యా, పిల్లలను అనాథలను చేశాయి.. తమ్ముడు మరణించిన పావుగంటకే అన్న మరణ వార్త తెలియడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. స్థానికుల కథనం ప్రకారం..
పెద్దూరు గ్రామానికి చెందిన మల్లవేణి మల్లవ్వ, మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు నర్సయ్య, రాజు ఉన్నారు. రాజు భవన నిర్మాణ కార్మికుడిగా.. నర్సయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ ఉమ్మడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. బుధవారం వెంకటాపూర్ నుంచి పెద్దూరుకు ద్విచక్రవాహనంపై వెళుతున్న రాజును కామారెడ్డి నుంచి సిరిసిల్ల వైపు వెళుతున్న కంటెయినర్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అతను దుర్మరణం చెందాడు. వెంకటాపూర్‌లో ట్రాక్టర్ నడుపుతున్న నర్సయ్య తమ్ముడి మరణ సమాచారం తెలుసుకొని ఆందోళనగా ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. వెంకటాపూర్ సమీపంలోని మూలమలుపు వద్ద సిరిసిల్ల నుంచి కామారెడ్డికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకేరోజు అన్నదమ్ములు ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది.
ఇదిలా ఉంటే.. రాజన్నసిరిసిల్ల నూతన కలెక్టరేట్ భవన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పైనుంచి బైక్‌పై వెళ్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన బొల్లి రవిని రగుడు బైపాస్ వద్ద సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న రవి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.