Vehicle falls into Gorge: జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కూలీలతో వెళ్తున్న వాహనం.. అదుపుతప్పి లోయలో పడింది. ఈ సంఘటన జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగింది. వాహనం లోయలో పడిపోవడంతో.. దానిలో ఉన్న నలుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో వాహనంలో ఉన్న మరికొందరు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు బాధితులంతా.. ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులని అధికారులు తెలిపారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్లేందుకు ఓ వాహనంలో వెళ్లుతుండగా.. అది లోయలో పడింది.
తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఖూని నాలా ప్రాంతంలో జాతీయ 44వ నెంబర్ రహదారిపై నుంచి వాహనం లోతైన లోయలో పడినట్లు రాంబన్ ఎస్పీ పీడీ నిత్య తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. గాయపడ్డ వారిని రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంబన్ పోలీసులు వెల్లడించారు.
Also Read: