టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ఆన్లైన్‌లో ఎన్నో రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మంచిగా వాడితే ఓవర్‌నైట్ స్టార్ అయిపోతారు. అదే పిచ్చి పీక్స్‌కు చేరి విపరీతంగా వాడితే ప్రాణానికి ముప్పు తెస్తుంది. ఇప్పుడు తాజాగా టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న వైజాగ్ అమ్మాయి విషాద కథ అందరిని కలిచి వేస్తోంది.
టిక్ టాక్ వీడియోలు.. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సోనికా కేతావత్ గురించి సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఉప్పల్ బాలు తన విచిత్రమైన హావభావాలతో టిక్ టాక్‌లో పాపులర్ అయినట్లు సోనికా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో వీడియోలు చేసి విపరీతమైన ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇంకా చెప్పాలంటే ఈమెకు టిక్ టాక్‌లో లక్షల మంది ఫాలోవర్స్.. ఇన్‌స్టాలో వేలల్లో అభిమానులు ఉన్నారు. కొందరైతే ఈ అమ్మాయిని సినిమాల్లోకి రావాలని కూడా ఆహ్వానించారు. అలాంటి సెలబ్రిటీగా మారిన ఈ అమ్మాయిని టిక్ టాక్ పిచ్చి తిరిగి రాని లోకాలకు పంపించేసింది.
సోనికాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల స్నేహితులతో కలిసి జాలీగా బైక్ రైడింగ్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో తీస్తుండగానే నల్గొండ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. అతివేగంగా వెళ్తున్న వీరి వాహనం ఎదురుగా వచ్చిన సైకిల్‌ను తప్పించబోయి.. అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది.
గాయపడిన సోనికాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్న చిన్న గాయాలే తగిలాయి అనుకుని అందరూ కూడా భావించారు. కానీ ఆ గాయాలు శరీరంకు బలంగా తగలడంతో రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించింది. ఇన్ఫెక్షన్ సోకడంతో ఈ టిక్ టాక్ స్టార్ ప్రాణాలు విడిచినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. అయితే ఆమెతో ప్రయాణించిన స్నేహితుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇక సోనికా మరణవార్తతో సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తాయి. టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన ఈ తెలుగమ్మాయి.. దానితోనే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పిచ్చి అనేది ఉండవచ్చు గానీ.. అది మన ప్రాణాల మీదకు వచ్చేలా తెచ్చుకోకూడదని యువతను డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.