నెల్లూరులో టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాయకులపేటకు చెందిన రియాజ్, షాహీనా దంపతుల మూడో కుమారుడు షేక్ రఫి. ప్రైవేటు కార్యక్రమాలకు వీడియోలు తీస్తూ అలాగే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఇతడు, నారాయణరెడ్డిపేటకు చెందిన ముస్తఫా మంచి స్నేహితులు. అయితే ముస్తఫా ఓ యువతిని ప్రేమిస్తున్న విషయం రఫీకి తెలుసు. కానీ రెండు నెలలుగా ఆ యువతి, రఫీ చనువుగా ఉంటున్నారు. దీంతో స్నేహితులిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ప్రేమ విషయమై మాట్లాడేందుకు ముస్తఫా ఆ యువతిని, రఫీని నాలుగో మైలు వద్దకు రప్పించాడు. అక్కడ ముస్తఫా, మరికొందరు స్నేహితులు రఫిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలతో ఇంటికెళ్లిన రఫీని తండ్రి రియాజ్ బాషా ఆసుపత్రికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ నెల 22న రాత్రి రఫీ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముస్తఫా బెదిరింపులతోనే తన కుమారుడు ఉరి వేసుకున్నాడని రఫీ తండ్రి ఆరోపిస్తున్నాడు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.