జీవితంలో ఉన్నతంగా ఉండాలని కలలు కన్న ఆ దంపతులు తమ స్వగ్రామం నుంచి పట్నానికి మకాం మార్చారు. అక్కడే ఉంటూ వారికి వచ్చిన పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తన తల్లిదండ్రులు, సోదరుడిని చూడాలన్న కోరిక కలిగింది. భర్తను ఒప్పించింది. భర్త, కుమారునితో కలిసి బైక్ పై స్వగ్రామానికి పయనమైంది. వారి సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో.. రోడ్డు ప్రమాదం(Road accident) రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్న కబళించింది. వారి ఆశలను చిదిమేసింది. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న మృతుల బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కర్ణాటక(Karnataka) హోసపేటెకు చెందిన మహమ్మద్‌గౌస్‌కు కదిరికి చెందిన అమ్మాజాన్‌తో వివాహమైంది. కొన్నాళ్లు అనంతపురం జిల్లా కదిరిలో ఉండి.. బెంగళూరు(Bangalore)కు మకాం మార్చాడు. పెళ్లికి ముందునుంచే మహమ్మద్‌గౌస్ ద్విచక్రవాహనాల క్రయవిక్రయాలను ఉపాధిగా ఎంచుకున్నారు.
మూడునెలల కిందటి వరకు కదిరిలోనే కాపురం ఉండేవారు. మహమ్మద్‌గౌస్‌కు బెంగళూరులో మంచి పరిచయాలు ఉండటంతో అక్కడే స్థిరపడితే వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందవచ్చన్న ఆశతో బెంగళూరుకు కాపురం మార్చాడు. మహమ్మద్ గౌస్ భార్య అమ్మాజాన్.. తన తల్లిదండ్రులు, సోదరుడిని చూడాలని కోరడంతో సోమవారం ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ పై వెళ్తుండగా చిక్కబళ్లాపుర సమీపంలోని హౌన్నేనహళ్లి క్రాస్ వద్ద ఓ ప్రైవేటు వాహనం.. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గమ్యం చేరేలోపే భర్త, కుమారుడితో పాటు రోడ్డు ప్రమాదం వారిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది. ప్రమాదం విషయం తెలుసుకున్న అమ్మాజాన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం.. వివరాలివే