Tomatoes Stolen In AP: మార్కెట్లో కూరగాయలు ధరలు మండుతున్నాయి. ఇక టమాట ధరలు మాత్రం ఎన్నడూ లేని విధంగా ఆకాశన్నంటుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టమాటా ధరలు పెట్రోల్, డీజిల్ ధరలను దాటి పరుగులు తీస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా అన్ని రాష్ట్రాల్లో కిలో టమాట ధరలు రూ.130 నుంచి 150 వరకు పలుకుతున్నాయి. వర్షాల ప్రభావంతో టమాట డిమాండ్ మరింత పెరిగింది. అయితే.. మార్కెట్లల్లో టమాటకు భారీగా డిమాండ్ ఉండటంతో దొంగలు.. వాటిపై కన్నేశారు. టమాటాలతో భారీగా డబ్బు సంపాదించుకోవచ్చని దొంగతనం చేశారు. ఈ వింత సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్‌లో చోటు చేసుకుంది.
మార్కెట్‌లో టమాట డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఆగంతకుల కన్ను వాటిపై పడింది. పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్‌లో గురువారం రాత్రి 3 టామాట ట్రేలు మాయమయ్యాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూరగాయలు మార్కెట్లో వ్యాపారం చేసుకొని వ్యాపారస్తులు ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో మూడు ట్రేలను మాయం చేశారు. ఒక్కొక్క ట్రే రూ.2000 పైగా ఉంటుందని వ్యాపారస్తులు పేర్కొన్నారు.
నెల రోజులు కష్టపడి కూరగాయలు అమ్ముకున్న ఆరువేల రూపాయలు కూడా గిట్టవని… అలాంటిది 6000 విలువగల టమాటా ట్రేలు మాయమవటంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. ఆ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: