రాష్ట్రంలో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. నకిలీ పంట విత్తనాలు తయరీ, సరఫరాపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసి కట్టడి చేస్తున్నారు. నకిలీ, నాసిరకం విత్తన రహిత తెలంగాణగా రూపొందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 602 కేసులు నమోదు చేసి, ఇరవై ఏడు మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. గత వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ములుగు మండలం శ్రీరాంపూర్‌లోని సిగ్నెట్ కంపెనీలో 5 కోట్ల రూపాయల విలువైన 2,384 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పరిధి లో 7 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ పంట విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
సెంట్రల్ జోన్ పరిధిలో 27 షాపులపై సోదాలు చేసి కొన్నింట్లో నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నట్టు గుర్తించి చర్యలు తీసుకున్నారు. పావని ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ సీజ్ చేశారు పోలీసులు. పోలీస్ శాఖ చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడద తగ్గినా… ఇతర రాష్ట్రాల ద్వారా ఈ నకిలీ విత్తనాలు సరఫరా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ధృవీకరించిన వ్యాపారుల వద్దనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నకిలీ విత్తనాలపై డయల్ 100కు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు పోలీసులు. కాగా విత్తనాలు అమ్మకం, సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. పోలీసులు తదనుగుణంగా యాక్షన్‌లోకి దిగిపోయారు.
Also Read: మరో డేంజరస్ వేరియంట్..ఏడు రోజుల్లో వెయిట్ లాస్ !..ఇవిగో వివరాలు