గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు సిద్ధమైన మావోయిస్టులు.. అప్రమత్తమైన పోలీసులు.. దండకారణ్యంలో వేట..!

|

Dec 02, 2020 | 8:57 AM

తెలంగాణలో గెరిల్లా ఆర్మీని బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దండకారణ్యం సరిహద్దుల్లో వేట ముమ్మరం చేశారు.

గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు సిద్ధమైన మావోయిస్టులు..  అప్రమత్తమైన పోలీసులు.. దండకారణ్యంలో వేట..!
Follow us on

తెలంగాణలో గెరిల్లా ఆర్మీని బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దండకారణ్యం సరిహద్దుల్లో వేట ముమ్మరం చేశారు. అణువణువూ జల్లెడ పడుతున్నారు. గతకొంత కాలంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఇవాళ్లి నుంచి ఈనెల 8వ తేదీ వరకు మావోయిస్ట్ గెరిల్లా ఆర్మీ పీఎల్‌జీఏ వారోత్సవాలు ఉండటంతో పోలీసులు మరింత అలర్ట్‌ అయ్యారు. అడవుల్లో మావోలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఒకవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం నగరంలో 52 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉంచినప్పటికీ… మరోవైపు సరిహద్దులను డేగ కళ్లతో పర్యవేక్షిస్తూనే ఉన్నారు పోలీసులు. ఇటీవల పోలీసుశాఖలో కొత్తగా చేరిన దాదాపు 10 వేల మంది పోలీసుల్లో మెరికల్లాంటి యువకులను మావోయిస్ట్‌ల వేటకు వినియోగిస్తున్నారు. మావోల అన్వేషణలో తలపండిన సీనియర్లు, రిటైర్డ్‌ పోలీసు ఆఫీసర్ల పర్యవేక్షణలో సరిహద్దుల్లో అణువణువూ జల్లడ పడుతున్నారు. అదనంగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూడా తోడవడటంతో కూంబింగ్‌ ముమ్మరం చేశారు.

పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ సరిహద్దులపై పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి నదులపై అత్యాధునిక డ్రోన్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. రాత్రిపూట మావోయిస్టులు నదులను దాటుకుని రాకపోకలు సాగిస్తన్నారన్న అనుమానంతో ఆయా ప్రాంతాలపై పోలీసులు బలగాలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పగలు, రాత్రి నిర్విరామంగా కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలకు వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు విస్తృతం చేశారు. ఇక మరోవైపు మారుమూల గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు ప్రజా రక్షణతో పాటు మావోయిస్టు ఏరివేతపై పోకస్ చేసినట్లు పోలీసులు తెలిపారు.