Hyderabad Newly Married Bride Suspected Death: హైదరాబాద్ మహానగరంలో నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. భర్త, అత్త మామల వేధింపులు భరించలేక నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి చెందిన ఘటన పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నవ వధువు షఫియా ఫాతిమా(21) పెళ్లై నెల రోజులు గడవకు ముందే ప్రాణాలను కోల్పోయింది.
హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన రషీద్‌తో 27 రోజుల క్రితం ఫాతిమా అనే యువతితో వివాహం జరిగింది. అయితే, అత్తవారింట్లోనే ఫాతిమాఅనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే నవ వధువు కుటుంబ సభ్యులు.. ఆమె అత్తారింటికి చేరుకున్నారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రెయిన్‌బజార్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఫాతిమాను అకారణంగా కొట్టి చంపారని వధువు బంధువుల ఆరోపణలు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.