Permission cancel for 6 Hospitals to covid Treatment: అక్కడ మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే. కరోనా రోగి కదా అన్న కరుణాలేదు.. చేసిందే చికిత్స.. వేసిందే బిల్లు! కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కరోనా పాజిటివ్ రిపోర్ట్‌తో ఆసుపత్రి మెట్లేక్కితే చాలు.. ఆస్తులు ఆమ్ముకోవల్సి వస్తోంది. కరోనా రోగుల పాలిట ప్రైవేటు ఆసుపత్రులు జలగల్లా పీల్చుకుతింటున్నాయి. ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని హెచ్చరించినప్పటికీ.. వాళ్లకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ముఖ్యంగా ట్రీట్‌మెంట్‌కి పర్మిషన్ లేకున్నా ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పలు హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకుంటున్నారు అధికారలు.
తాజాగా తెలంగాణలో మరో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రద్దు చేస్తూ తెలంగాణ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన పద్మజ ఆసుపత్రి, అల్వాల్ ప్రాంతంలోని లైఫ్‌లైన్ మెడిక్యూర్, ఉప్పల్‌లోని టీఎక్స్ ఆస్పత్రి, హన్మకొండకు చెందిన మ్యాక్స్ కేర్ ఆస్పత్రి, వరంగల్‌లోని లలిత ఆస్పత్రి, సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీసాయి రాం ఆస్పత్రి ఉన్నాయి. కోవిడ్ బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రైవేట్ ఆసుపత్రులపై కఠినచర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.
ఇక, ఇప్పటి వరకు 105 ఆస్పత్రులపై 166 ఫిర్యాదులు వచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫిర్యాదులపై విచారణ చేపట్టి, సంబందిత ఆస్పత్రులకు షోకాజు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. షోకాజు నోటీసులు అందిన తర్వాత 24 గంటల్లోపు సరైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో ఆస్పత్రి లైసెన్సును రద్దుచేస్తామని హెచ్చరించింది. మరోవైపు, ఇప్పటి వరకు 16 ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.