Genco Employee family Disappears: నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖ ఉద్యోగి అదృశ్యం కలకలం రేపుతోంది. ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబం కనిపించకుండపోయింది. అయితే, అతని వాహనం నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద కనిపించడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. నాగార్జునసాగర్ జెన్‌కోలో పనిచేస్తున్న ఉద్యోగి మండారి రామయ్య తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, అతని ఇంట్లో ఉత్తరం పెట్టి అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది.
నాగార్జున సాగర్‌లోని పైలాన్‌లోని జెన్‌కో కాలనీ 9హెచ్‌లో మందారి రామయ్య(36) నివాసముంటున్నారు. నాగార్జునసాగర్ జెన్‌కోలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొంత కాలంగా ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. తానొక్కడిని చనిపోతే తన భార్య నాగమణి(30), కుమారుడు సాత్విక్(12) అనాథలవుతారనే ఉద్దేశంతో వారిని కూడా తోడు తీసుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. సాగర్ కొత్త వంతెనపై అతని ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, రామయ్య భార్య, కొడుకుతో సహా అక్కడి నుంచి జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువులు నదీతీరంలో ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు విచారణ చేపట్టగా రామయ్య, అతడి భార్య, కుమారుడు ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు సీసీ కెమెరాలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తిరుమలగిరి మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన రామయ్య వ్యవసాయ భూమి టెయిల్‌పాడ్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైంది. అతనికి నిర్వాసితుల కింద జెన్‌కోలో అటెండర్ ఉద్యోగం ఇచ్చారు. అయితే, గత కొంతకాలం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
Read Also…