Fake Covid Vaccine Certificate: జనం అవసరాలను అసరాగా చేసుకుంటున్న ఫేక్ గాళ్లు, ఫేక్ పనులు చేస్తూ.. డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి బ్యాచ్‌కు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. వ్యాక్సి(Vaccination)న్ తీసుకోకున్న పాతబస్తీ నుంచి విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న స్థానికులకు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ అందిస్తున్న నలుగురు యువకుల ముఠా సభ్యులను పాతబస్తీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వ్యాక్సిన్ సర్టిఫికెట్లు(Fake Vaccine Certificate), సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కాలాపత్తర్ పోలీసులు. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ నిర్ధారణ పత్రాలు ఉండాలి, అలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అలీబాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సైఫ్ ఈ దందాకు తెరతీశాడు.
సరూర్ నగర్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటరులో విధులు నిర్వహిస్తున్న సైఫ్ 1000 రూపాయలు తీసుకొని వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందిస్తున్నాడన్న పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిఐ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు.. మహమ్మద్ సైఫ్‌తో పాటు అతనికి సహకరిస్తున్న మిస్బా ఉల్లా షరీఫ్, మహమ్మద్ అస్లం, మహమ్మద్ ఫరీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఆధార్ కార్డు కాపీలు, వ్యాక్సిన్ సర్తిఫికెట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు కాలాపత్తర్ పోలీసులు తెలిపారు.
వీరి నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు.. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొందరి హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు సమాచారం అందడంతో వారి కోసం గాలిస్తున్నారు. కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇలాంటివి అనేక దందాలు పుట్టుకొచ్చాయి. అయితే, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరైన ఈ సమయంలో కొంత మంది ఇలాంటి ఫేక్ గాళ్లను ఆశ్రయిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోకున్నా.. ఇలాంటి సర్టిఫికెట్ అందిస్తూ ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. అయితే వీరి ఆటలు ఎక్కువ కాలం సాగలేదు. చట్ట విరుద్ధానికి పాల్పడి, దొడ్డి దారిన ఏ పని చేపట్టినా చట్టం దృష్టిలో నేరమే అవుతుందంటున్న పోలీసులు.. ఇలాంటి మార్గాలను అనుసరిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Read Also…. UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోకి పాకిస్థాన్ జాతిపిత ఎంట్రీ.. జిన్నా జపంకు కారణమేంటి..?