Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గపడుతుండటంతో ముఖ్యంగా బీజేపీ(BJP), సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party)ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేతలు ట్వీట్లతో పంచ్‌లు పేల్చుతున్నారు. ఓటర్లను ఆకట్టుకుంటూనే, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో యోగీ ఆదిత్యనాథ్(Yogi Adithyanath) వర్సెస్ అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) పొలిటికల్ ఫైట్ హీటెక్కింది. తాజాగా ఈ ఫైట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా. అసలు యూపీ ఎన్నికలకు, జిన్నాకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడి ఉంది అసలు ట్విస్ట్..
ఇక్కడి వరకు ఎలా ఉన్నా, యూపీ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు పాకిస్తాన్ జాతిపిత జిన్నా. యూపీలో ముస్లిం ఓట్లు ఏ పార్టీ గెలుపోటములకు అయినా కీలకమే. అందుకే వారిని ఆకర్షించేందుకు అన్ని పార్టీలు కీలక ప్రకటనలు చేస్తుంటాయి. ఈ విషయంలో తాజాగా ఓ అడుగు ముందుకేశారు ఎస్పీ చీఫ్ అఖిలేశ్. పాకిస్థాన్ జాతిపిత, భారత విభజనకు కారణమైన మహమ్మద్ అలీ జిన్నా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ, ప్రశంసలు కురిపించారు అఖిలేష్ యాదవ్. సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులు అయ్యారనీ, వీరంతా భారత స్వాత్రంత్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారని కొనియాడారాయన.
అయితే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను జిన్నా వ్యాఖ్యపై లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో సమానం చేసినట్లుగా యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన దాడి చేశారు. SP చీఫ్ అఖిలేష్ యాదవ్ పేరును నేరుగా పేర్కొనకుండా ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల వలె సర్దార్ పటేల్, జిన్నా గురించి ఒక పార్టీకి చెందిన నాయకుడు ఇటీవల మాట్లాడారని మండిపడ్డారు.
మరోవైపురంగంలోకి దిగారు బీజేపీ నేతలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తుంటే, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలి జిన్నాను ఆరాధిస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం యోగీ. పాకిస్థాన్ అంటే వాళ్లకు చాలా ఇష్టమని, తాము మాత్రం భారత్ కోసం ప్రాణాలిస్తాం అంటూ హై ఓల్టేజ్ ట్వీట్లు చేశారు యోగీ. ఎన్నికలు వచ్చినప్పుడే జిన్నా పేరును ఎందుకు లేవనెత్తుతారో అర్థం కావడం లేదని, తాము రైతుల గురించి మాట్లాడుతుంటే, వాళ్లు జిన్నా ప్రస్తావన చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ జాతీయ నేతలు. ముస్లిం ఓట్ల కోసమే అఖిలేష్ జిన్నా భజన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఏదేమైనా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది యూపీగా మారారు జిన్నా.