ACB Raids on Ex DSP: అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ నివాసంపై అవినీతి నిరోధక అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదులతో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మాజీ డీఎస్పీ జగన్ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని ఆయన నివాసంతోపాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. హెచ్‌ఎండీఏ డీఎస్పీగా పని చేస్తున్న సమయంలో జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2019లో విజిలెన్స్ డీఎస్పీగా ఉన్న జగన్‌ను నవంబరు నెలలో డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేశారు.
తాజాగా హెచ్ఎండీఏకు సంబంధించి ఓపెన్ ప్లాట్ విషయంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గరి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారలు దాడులు చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. జగన్ నివాసంలో ఇంటికి సంబంధించిన పత్రాలతోపాటు కేజీ బంగారం, విలువైన డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. జగన్ బంధువులు కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. జగన్ లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండీఏలో డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలో రియల్టర్లతో కలిసి భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డట్టు జగన్‌పై ఆరోపణలు ఉన్నాయి. జగన్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన బినామీ ఆస్తులపై వివరాలను అరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరెన్నో ఆస్తులు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
Read Also… Bus Fire Accident: ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు.. ఆకతాయిల పనా? మావోయిస్టుల దుశ్చర్యా..?