Sub Inspector, Four constables suspended: అవినీతికి పాల్పడిన ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చర్యలు తీసుకున్నారు. గతంలో.. పేకాట స్థావరంపై దాడి చేసి రికవరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ ఎస్ఐతోపాటు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు వివరాలు.. గతేడాది నవంబర్‌లో హైదరాబాద్ మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో కానిస్టేబుళ్లు మురళి, ఇమాన్లు, రవికిరణ్, జానకిరామ్ బృందం 14 మందిని అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో పట్టుబడిన వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బు రికవరీ చేసి, అధికారికంగా తక్కువగా చూపించారని సీపీకి ఫిర్యాదులు అందాయి.
దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. అనంతరం ఈ కేసులో ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లు అవకతవకలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఎస్ఐ తోపాటు కానిస్టేబుళ్లను సీపీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే.. అరెస్టు అయిన వారిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. అయితే.. కానిస్టేబుల్ పట్టుబడిన సమయంలో అతన్ని మంగళ్‌హాట్ పోలీసులు వదిలి పెట్టకపోవడంతో రికవరీలో అవకతవకలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కాగా.. రూ.4.12 లక్షలు రికవరీ చేసి, వాటిని కోర్టులో సమర్పించామని మంగళ్‌హట్‌కు చెందిన ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ కేసులో చార్జిషీట్ కూడా వేశామని.. తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. కాగా.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
Also Read: