Snake bites child: అభంశుభం తెలియని పది నెలలు నిండని శిశువును కాలనాగు కాటేసి పొట్టనబెట్టుకుంది. కేరింతలు కొడుతూ.. ఇంట్లో సందడి చేసి తమ బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లాలోని నాంపల్లి మండలంలోని ముంపు గ్రామం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన బాణావత్ గణేశ్-దివ్య దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. కుమారుడు భవిత్‌కు పది నెలలు.
కాగా.. దివ్య భవిత్‌ను చంకలో ఎత్తుకొని ఆదివారం సాయంత్రం ఇంట్లో ఆడిస్తోంది. ఈ క్రమంలో కిటికీలో ఉన్న ఆట బొమ్మలను చిన్నారికి అందించేందుకు తల్లి.. అక్కడకు వెళ్లింది. అయితే.. ఇంటి లోపల గోడలకు ప్లాస్టింగ్ చేయలేదు. దీంతో అప్పటికే ఇటుకల మధ్యలో దూరి ఉన్న తాచుపాము.. చంకలో ఉన్న చిన్నారి కాలుపై కాటు వేసింది. బాబు ఉలికిపాటును గమనించిన తల్లి.. మళ్లీ అటువైపు తిరిగేలోపే కాటేసింది.
ఇది చూసిన దివ్య ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చిన్నారి భవిత్ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. కాగా.. క్షణాల వ్యవధిలోనే చిన్నారి కళ్లెదుటే కన్నుమూయడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమన్నీరవుతున్నారు. అనంతరం పాములు పట్టే వ్యక్తిని రప్పించి తాచుపామును బంధించారు.
Also Read: