Nellore district Lovers Suicide attempt Case: నెల్లూరు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గూడూరు రెండో పట్టణంలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తేజస్విని, వెంకటేష్ అనే యువతీ, యువకులు గూడురు రెండో పట్టణంలోని ఓ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆపస్మారక స్థితిలో ఉన్న వీరిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తేజస్విని మరణించగా.. వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు,
అయితే, ఈ జంట ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించింది అన్న దానిని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టడంతో ప్రేమ పేరుతో నయవంచనకు పాల్పడ ఉన్మాది వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమను నిరాకరించిందని బీటెక్ విద్యార్థిని ఉరేసి చంపి.. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నాటకమాడాడు ఆ ఉన్మాది. తాము ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకునేందుకు పెద్దలు ఒప్పుకోనందున ఇలా చేయాల్సి వచ్చిందంటూ కట్టుకథలు అల్లాడు. పోలీసుల విచారణలో అతని అసలు రంగు బయటపడింది.
నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిందీ దారుణ ఘటన. తనను ప్రేమించాలంటూ బీటెక్ విద్యార్థిని వెంటపడేవాడు వెంకటేష్. అయితే ఆమె లైట్ తీసుకుంది. దీంతో ఉన్మాదిగా మారిపోయి పగ పెంచుకున్నాడు. అదను చూసి ఆమెను ఉరి తీశాడు. తాను బయటపడేందుకు డ్రామా ఆడాడు. అంతకుముందు.. వెంకటేష్‌పై అతని తండ్రికి ఫిర్యాదు చేశాడు అమ్మాయి తండ్రి. మా అమ్మాయి వెంట పడుతున్నాడు.. మీవాడిని కాస్త దారిలో పెట్టుకోండని హెచ్చరించాడు. దీంతో పెద్దల మందలింపుతోనైనా అతని తీరు మారలేదు. బీటెక్ స్టూడెంట్‌ను చంపి.. నాటకమాడి.. అడ్డంగా బుక్కయిపోయాడు. కాగా, ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నెల్లూరు పోలీసులు విచారణ చేపట్టడంతో నిందితుడి అసలు రూపం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేష్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also… వావ్ ! ‘స్వీటే ఆయుధం కాగా’… బర్త్ డే కేక్ విసిరి చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు.. ఎక్కడంటే..?