School director: దేశంలో నిర్భయ లాంటి చట్టాలు అమలవుతున్నప్పటికీ.. కీచకుల బుధ్ది మారడం లేదు. ఉన్నతంగా చదువుకున్న వారు కూడా విద్యార్థినుల పట్ల మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులపై ఓ స్కూల్ డైరెక్టర్ కన్నెశాడు. స్పెల్లింగులు నేర్పిస్తానని చెప్పి అతని గదికి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కోట్ లోధిక తాలుకాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు డైరెక్టర్‌గా దినేశ్ జోషి పని చేస్తున్నాడు. కరోనా అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో… దినేశ్ జోషి కొన్ని రోజుల క్రితం స్పెల్లింగులు నేర్పిస్తానంటూ ఇద్దరు బాలికలను తన రూమ్‌కి రమ్మని పిలిచాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే.. వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అక్కడి నుంచి వచ్చిన అనంతరం ఓ బాలిక ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. మరో అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలిసింది. వీరిద్దరే గాక అతని ప్రవర్తన అందరితో ఇలానే ఉండేదని పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇతర బాధిత విద్యార్థులు అంతకుముందు తమపై జరిగిన దారుణాల గురించి చెప్పారు. దీంతో దాదాపు వందమంది తల్లిదండ్రులు, విద్యార్థినులు లోధిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జోషిపై ఫిర్యాదు చేశారు. నిందితుడు జోషి భార్య సీమా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే.. ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. బాధిత బాలికల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో జోషిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని బాధిత బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: