Kindap: సినీ ఫక్కీలో భర్తను కిడ్నాప్ చేసిన భార్య తరఫు బంధువులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

Dec 29, 2021 | 10:59 AM

మతాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో యువకుడిని కిడ్నాప్ చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

Kindap: సినీ ఫక్కీలో భర్తను కిడ్నాప్ చేసిన భార్య తరఫు బంధువులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Kindap
Follow us on

మతాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో యువకుడిని కిడ్నాప్ చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల నవీన్‌కుమార్‌, ఇర్ఫాన బేగం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నవీన్‌ కుమార్‌ నగరంలోని అరవింద్‌నగర్‌లో ఒక ట్రావెల్స్‌లో పనిచేస్తున్నాడు.

ఇర్ఫానా బేగం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. వీరి ఇళ్లలో వివాహానికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు రెండు రోజుల క్రితం రాప్తాడు సమీపంలోని పండమేరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం పెద్దలకు ఇష్టం లేకపోవడంతో నవీన్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేయాలని యువతి తరఫు బంధువులు ఏడుగురు కుట్రపన్నారు.

పెళ్లి చేసుకున్న ప్రేమికులు నగరంలోని అరవింద్‌నగర్‌లో ఓ దుకాణంలో అంతకుముందే ఉంచిన తమ దుస్తులు తీసుకొనేందుకు వచ్చారు. ఇది గమనించిన అమ్మాయి తరఫు బంధువులు యువకుడిని ఓ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. వీరి నుంచి తప్పించుకున్న యువతి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలతో టూటౌన్ పోలీసులు అరగంట కాలవ్యవధిలో ప్రసన్నాయపల్లి రైల్వేగేటు సమీపంలో కిడ్నాపర్లను పట్టుకున్నారు. ప్రేమికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ తతంగమంతా సినీఫక్కీలో జరిగింది.

Read Also.. Crime News: జగద్గిరిగుట్ట లో దారుణం.. క్షణికావేశంలో మామను హత్య చేసిన అల్లుడు..!