గుంటూరు నగరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గత మూడు నెలల క్రితం బొల్లాపల్లి మండలం పేరూరుపాడుకు చెందిన కాట్ల విజయలక్ష్మి అనే యువతిని అదే గ్రామానికి బొప్పుడి శ్రీనివాసరావు అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే విజయలక్ష్మిని వదిలేయాల్సిందిగా ఆమె తల్లిదండ్రులు తనను బెదిరిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నాడు. వారే ఆమెను కిడ్నాప్ చేశారేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కాగా గుంటూరు జిల్లా పలకలూరు విజ్ఞాన్ కాలేజ్ లో విజయలక్ష్మి బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. పరీక్షలు రాసేందుకు కాలేజ్ కి తీసుకెళుతుండగా గురువారం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని శ్రీనివాసరావు చెబుతున్నాడు. తన భార్య ఆచూకీ కనుగొని తనకు న్యాయం చేయాలని కోరుతూ అతడు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాధితుడు చెప్పిన వివరాలను అనుసరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.
నిశ్చితార్థానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో వాలంటీర్ మృతి…
గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వాలంటీర్ మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కాణిపాకం మండలం చిత్తన్నగారిపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. పూతలపట్టు మండలం పేట అగ్రహారానికి చెందిన భానుప్రకాశ్ గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం కాణిపాకంలో తన వివాహ నిశ్చితార్థం కోసం బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను స్పాట్‌లోనే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇకలేడనే వార్త విన్న తల్లిదండ్రులు బోరున విలపించారు. శుభకార్యం జరగాల్సిన రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి అంధుడు కావడం.. కుమారుడి మీదే ఆధారపడిన కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పంచనామా నిమిత్తం డెడ్‌బాడీని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: బర్త్ డే దావత్ బ్రతుకులను ఛిద్రం చేసింది.. ఇద్దరు మృతి