విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నదిలో దూకిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితం ఈ ప్రేమ జంట నాగావళి నదిలో దూకిన ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఈతగాళ్ల సాయంతో ప్రేమజంటన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 42 గంటల తరువాత మృతదేహాలు నదిలో తేలాయి. మృతులు బొబ్బిలికి చెందిన రాకేష్, కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు.
తోటపల్లి బ్యారేజి వద్దకు ఈ ఇద్దరు ఓ స్కూటీపై వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదట అక్కడే కూర్చుని ఓ సెల్ఫీ విడియోను తీసుకున్నారు. ఆ వీడియోను తమ వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. తమ చావుకు తన బావ మౌళి అనే వ్యక్తే కారణమంటూ ఆ బాలిక వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు తెలిసింది. వీరిద్దరూ ఒకరినొకళ్ళు చున్నీతో కట్టుకొని నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ బిడ్డల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.