బాలింత మిస్సింగ్ మిస్టరీ…ఊహించని రీతిలో శవమై..

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుండి మిస్ అయిన బాలింత మరణం మిస్టరీగా మారింది. ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన 20 రోజులకు పట్టణ శివారులోని‌ చెట్ల పొదల్లో శవమై తేలింది.

బాలింత మిస్సింగ్ మిస్టరీ...ఊహించని రీతిలో శవమై..

Updated on: Oct 06, 2020 | 2:55 PM

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుండి మిస్ అయిన బాలింత మరణం మిస్టరీగా మారింది. ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన 20 రోజులకు పట్టణ శివారులోని‌ చెట్ల పొదల్లో శవమై తేలింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకొంది. ఇంతకీ ఆ మహిళది హత్యా.. ఆత్మహత్య..? అసలేం ఏం జరిగి ఉంటుంది?

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని శ్రీ కిరణ్ ప్రసూతి నర్సింగ్ హోమ్ నుంచి సెప్టెంబరు 17 న అదృశ్యమైన మానస అనే బాలింత కేసు మిస్టరీగా మారింది. చెన్నూరు శివారులోని లంబాడిపల్లికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో ఓ మృతదేహం స్థానికుల కంటపడింది. విచారణ జరిపిన పోలీసులు అస్పత్రి నుంచి అదృశ్యమైన మానసగా గుర్తించారు.

కొమురంభీం జిల్లా దహెగాం మండలం లగ్గాంకు చెందిన మానసకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నాగపూర్‌కు చెందిన రమేష్ కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. 15 ఏళ్ల తరువాత మానస గర్బం దాల్చింది. గత నెల 13న పురిటి నొప్పులతో బాధపడుతుండగా చెన్నూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మానస పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

సెప్టెంబరు 17న మానస ఆస్పత్రి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాదాపు మూడు రోజుల పాటు జాగిలాల సాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. బిడ్డ కోసమైనా తిరిగి వస్తుందని ఎదురుచూస్తున్న క్రమంలో ఆమె మృతదేహం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.