చదువులో అగ్రస్థానం అనుకునే కేరళ.. ఇప్పుడు దారుణ ఘటనలకు కూడా అగ్రస్థానంలో నిలుస్తోంది. తిరువనంతపురంలో చోటుచేసుకున్న ఘటనను చూసి దేశవ్యాప్తంగా జంతుప్రేమికులు షాక్ తింటున్నారు. వంచియూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పిల్లిని ఉరితీశారు కొందరు దుండగులు. పాల్‌కులంగరకు సమీపంలో వినోద కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన క్లబ్ ఎదుట ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేంద్ర ప్రభుత్వాధికారి పెరట్లో ఉన్న షెడ్డును క్లబ్‌లా వాడుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ ఆదివారం రోజున షెడ్‌లోకి ఓ పిల్లి ప్రవేశించింది. దీంతో ఆ క్లబ్‌కి చెందిన కొందరు దుండగులు దాన్ని చిత్రహింసలకు గురిచేశారు. క్లబ్ సమీపంలోనే ఉన్న ఓ తాడుకు ఆ పిల్లిని వేలాడదీశారు. అనంతరం దాన్ని చిత్రవిచిత్రంగా హింసిస్తూ.. ఉరితీశారు.
అయితే పిల్లిని హింసిస్తున్న ఘటనను చూసిన స్థానికులు.. విషయాన్ని పోలీసులకు అందించారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే ఆ దుండగులు ఆ పిల్లిని మట్టిలో పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు ఈ ఘటనపై తొలుత కేసు నమోదు చేయకపోవడంతో.. జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువులపై ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఫర్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (FIAPO) కో ఆర్డినేటర్ పార్వతి మోహన్ ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ ఓ డాక్టర్ కుక్కపైకి తుపాకీ గురిపెట్టి కాల్చి చంపిన ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది.