Realter Murder Case: సంచలనం సృష్టించిన రియల్టర్ హత్య కేసు ప్రకాశం జిల్లా(Prakasam District) పోలీసులు ఛేదించారు. ఎర్రగొండపాలెం(Erragondapalem)లో భూవివాదం నేపధ్యంలో జరిగిన రియల్టర్ ఆదినారాయణ హత్య కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదినారాయణ కళ్లల్లో కారం చల్లి అనంతరం కత్తులతో అతి కిరాతకంగా నరికి హత్య చేసిన ఈ సంఘటన కలకలం రేపింది. నిందితులకు సహకరించారన్న అభియోగాలపై ఎర్రగొండపాలెం తహసీల్దార్ వాడాల వీరయ్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తహసీల్దార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్టు ప్రకాశం జిల్లా ఎస్‌పి మలిక్ గార్గ్ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన మూడు కత్తులు, ఐదు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెంలో భూవివాదం హత్యకు దారితీసింది. వైసీపీకి చెందిన ఆదినారాయణ, గురుప్రసాద్‌ల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. దీంతో ఆదినారాయణ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో పెద్ద మనుషుల మధ్య జరిగిన సయోధ్య విఫలం కావడంతో ఆదినారాయణపై గురుప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ఆదినారాయణను ఎలాగైనా హత్య చేయించాలని పక్కా ప్లాన్ వేశాడు. ఇందుకోసం కర్నూలు జిల్లాకు చెందిన కానాల వెంకట నారాయణ రెడ్డి, పోలిశెట్టి అశోక్, జలగిరి రాజశేఖర్, ఎర్రగొండపాలెంకు చెందిన జగన్నాధం మస్తాన్, దిగుమర్తి ఆదినారాయణలతో కిరాయి హత్యకోసం 20 లక్షల రూపాయలతో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు ఇచ్చాడు. దీంతో ఆదినారాయణను హత్య చేసేందుకు కిరాయి హంతకులు ముందుగా ప్లాన్ చేసి రెక్కీ నిర్వహించారు. ఒకసారి ఆదినారాయణ బైక్‌ను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో ఆదినారాయణ తప్పించుకోవడంతో ఆసారి పక్కాప్లాన్ ప్రకారం హత్య చేయాలని భావించి ఆదినారాయణ వచ్చే రహదారిలో ముందుగానే రెక్కీ నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఈనెల 16న గోశాల నుంచి ఎర్రగొండపాలెం వస్తున్న ఆదినారాయణను దారికాచి అడ్డగించారు. ఆదినారాయణను కిందపడేసి కళ్లల్లో కారం చల్లారు. అనంతంరం కత్తులతో విచక్షణా రహితంగా నరికారు. అప్పటికీ ఆదినారాయణ చనిపోలేదన్న అనుమానంతో బండరాళ్లతో ముఖంపై కొట్టి ఛిద్రం చేశారు. చివరకు ఆదినారాయణ చనిపోయాడని నిర్ధారించుకుని ముగ్గురు నిందితులు బైక్‌పై పారిపోగా, మిగిలిన వారు పొలాల్లో తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.
ఈ సంఘటన ఎర్రగొడపాలెంలో కలకలం రేపింది. ఆదినారాయణను పక్కాప్లాన్ ప్రకారం గురుప్రసాద్ హత్య చేయించాడంటూ ఆదినారాయణ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. మృతుడు ఆదినారాయణ, నిందితుడు గురుప్రసాద్ ఇద్దరూ వైసీపీ నేతలు కావడంతో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్ అనుచరులు కావడంతో కేసు సీరియస్‌గా మారింది. మంత్రి సురేష్ కూడా హత్యకేసును నిస్పక్షపాతంగా విచారించాలని పోలీసులను కోరడంతో ఎస్‌పి మలిక్ గార్గ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితుడు గురుప్రసాద్‌కు భూమిపై హక్కుల విషయంలో ఎర్రగొండపాలెం తహసీల్దార్ వాడాల వీరయ్య సహకరించినట్టు గుర్తించారు. తహసీల్దార్‌పై కూడా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో తహసీల్దార్ వాడాల వీరయ్యను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన ప్రత్యేక బృందం ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు కర్నూలుకు చెందిన పాత నేరస్తులని పోలీసులు తెలిపారు. ఆదినారాయణను హత్య చేసేందుకు ప్రధాన నిందితుడు గురుప్రసాద్ కర్నూలుకు చెందిన కిరాయి హంతకులతో 20 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుని ఆడ్వాన్స్‌గా లక్ష రూపాయలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ప్రధాన నిందితుడు గురుప్రసాద్‌తో పాటు 6 గురు కిరాయి హంతకులను అరెస్ట్ చేసి మూడు కత్తులు, ఐదు సెల్‌పోన్లు, బైక్ స్వాదీనం చేసుకున్నట్టు ఎస్‌పి మలిక్ గార్గ్ తెలిపారు.
— ఫైరోజ్, టీవీ 9 ప్రతినిధి, ఒంగోలు.