మేడ్చల్ జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన పోలీస్ అధికారి రాష్ట్రంలో మైనర్లపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చట్టాలు ఎంత కఠినతరం చేసినా నిందితులు భయపడటం లేదు. అంతేకాకుండా ఆపదకు ఆదుకోవాల్సిన చేతులే కాటేస్తున్నాయి. సాయం ముసుగులో కొంతమంది అత్యాచారాలకు పాల్పడుతూ ఉద్యోగ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. తాజాగా ఓ బాలికపై ఏఎస్సై అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లు సెబాస్టియన్ అనే వ్యక్తి ఓ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడే వాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఏఎస్సై సెబాస్టియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసి రిమాండ్‌కు తరలించారు.