Tirupati Couple Murder Mystery: తిరుపతిలో దంపతుల హత్య కేసును తమిళనాడు పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని తిరుత్తణికి చెందిన సంజీవ్ రెడ్డి, మాల ఫైనాన్స్ వ్యాపారంలో కోట్లు సంపాదించారు. వీరి కుమారుడు బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉన్నా.. కుటుంబ కలహాల కారణంగా కొద్దిరోజుల ముందే కూతురు ఆత్మహత్య చేసుకుంది. దీంతో సంజీవ్ రెడ్డి వాపారాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో సంజీవరెడ్డి వ్యాపారాలు అల్లుడు రంజిత్ చూసుకోవడం ప్రారంభించాడు. కొన్ని రోజులు వ్యవహారం బాగానే ఉన్నా, నగదు లావాదేవీల్లో ఇద్దరి మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం జరిగేది. రంజిత్ వ్యాపారాలకు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని సంజీవ్ రెడ్డి నిలదీశారు. దీంతో సంజీవ్ రెడ్డిని అందమొందించాలని రంజిత్ నిర్ణయించుకున్నాడు. వెంటనే ప్లాన్ వేసి, పక్కాగా అమలు చేశాడు. రంజిత్ అతని మిత్రులతో కలిసి హత్య చేయించారు.
గతనెల 29వ తేదీన వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దామని చెప్పి అత్తమామలను కారులో తీసుకొచ్చాడు. దర్శనానంతరం తిరుత్తణికి తిరుగు ప్రయాణం కాగా.. కారులోనే సంజీవరెడ్డి, మాలతిని మెడకు తాడు బిగించి చంపేశాడు. అదే రోజు రాత్రి రామచంద్రాపురం మండలం పచ్చికాపల్లం ప్రధాన రహదారి చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో మృతదేహాలను పడేసి వెళ్లిపోయాడు. తన తల్లిదండ్రులు కనబడకపోవడంతో కుమారుడు తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రంజిత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించడంతో తానే హతమార్చినట్లు అంగీకరించాడు. సోమవారం తిరుత్తణి, ఆర్సీపురం పోలీసులు సంజీవరెడ్డి బంధువుల సమక్షంలో శవపంచనామాలు నిర్వహించారు. తిరుపతి పోలీసుల సహాయంతో విచారించిన తమిళనాడు పోలీసులు… సంజీవరెడ్డి ఇంట్లో నగదు, బంగారం కనిపించకుండా పోవడంతో అనుమానంతో రంజిత్ ని విచారించగా ఆస్తి కోసం ఈ హత్యలను చేయించినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.