పేద, మద్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా హోమ్‌లోన్ తీసుకున్న లబ్ధిదారులకు తమ లోన్‌లో కొంత సబ్సిడీ లభిస్తుంది. దీన్నే అవకాశంగా మలుచుకుని ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించింది ఓ కంపెనీ.
లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సబ్సిడీలను మింగేసింది డీహెచ్ఎఫ్‌ఎల్ కంపెనీ. దీని ఖాతాలను ఆడిట్ చేయడంతో ఈ మోసం బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్‌ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ తో పాటు డైరెక్టర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్‌ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్‌టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేసింది డీహెచ్ఎఫ్‌ఎల్. అంతేకాదు అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య 2 లక్షల 60 వేల నకిలీ ఖాతాలను సృష్టించి 14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపించింది. 11,756 కోట్లను ఇలాగే దారిమళ్లించినట్టు బయటపడింది. దీంతో డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌తో పాటు కంపెనీ డైరెక్టర్లపైనా కేసులు నమోదయ్యాయి. గతంలో యెస్ బ్యాంక్ స్కామ్‌లోనూ కపిల్ వాద్వాన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి ఉత్తుత్తి ఖాతాలతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చే సబ్సిడీ కోసం ఏకంగా రెండున్నర లక్షలపైన నకిలీ ఖాతాలను సృష్టించి, సొమ్ములు మింగేయడంతో సీబీఐ ఫోకస్ పెట్టింది.
Also Read: AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులు, వేసవి సెలవులు… పూర్తి షెడ్యూల్ ఇదే…
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి