ORR Car Fire: ఓ డాక్టర్ ప్రాణాన్ని బలిగొన్న ఎలుకలు.. కారులో వ్యక్తి సజీవదహనం దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు..!

|

Sep 20, 2021 | 9:33 AM

ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్‌ వద్ద శనివారం రాత్రి దగ్ధమైన కారులో సజీవదహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన డాక్టర్ నేలపాటి సుధీర్‌(45)గా గుర్తించారు.

ORR Car Fire: ఓ డాక్టర్ ప్రాణాన్ని బలిగొన్న ఎలుకలు.. కారులో వ్యక్తి సజీవదహనం దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు..!
Orr Car Fire Acciden
Follow us on

ORR Car Fire Accident: ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్‌ వద్ద శనివారం రాత్రి దగ్ధమైన కారులో సజీవదహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన డాక్టర్ నేలపాటి సుధీర్‌(45)గా గుర్తించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, ప్రాథమికంగా కారులో వైర్లను కొట్టేయడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని అనుమానిస్తున్నారు.

ఎలుకలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయని ఈ మాటల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ఎలుకలు కారులోని వైర్లను కొట్టేశాయి. అయినా పర్లేదు. క్షేమంగా వచ్చేస్తానులే’.. తన భార్యతో సెల్‌ఫోన్‌ మాట్లాడిన డాక్టర్ సుధీర్ అంతలోనే అగ్నికి అహుతయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన సుధీర్‌ కుటుంబం కూకట్‌పల్లి శివాజీనగర్‌లో నివాసముంటోంది. సుధీర్‌ మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా పనిచేస్తున్నారు. శుభకార్యం కోసం శనివారం సాయంత్రం ఒంగోలుకు బయలుదేరారు.

అయితే, రాత్రి 7.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ పెద్ద గోల్కొండ 135 కిలోమీటర్‌ పాయింట్‌ వద్ద అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. కారు డోర్లు తెరుకోకపోవడంతో సుధీర్‌ అందులోనే సజీవదహనమయ్యారు. ఎరుపు రంగు కారు ఆధారంగా ఓఆర్‌ఆర్‌పై ఎంట్రీ వద్ద తనిఖీచేసిన శంషాబాద్‌ పోలీసులు.. కారు నంబర్‌ ఏపీ 27 సీ0206గా గుర్తించారు. కారుపై ఉన్న ఈ చలాన్‌కు లింక్‌ఉన్న ఫోన్‌ నంబర్‌ను గుర్తించారు. దాని నుంచి వెళ్లిన చివరి కాల్‌ ఆధారంగా చనిపోయింది డాక్టర్‌ సుధీర్‌గా శంషాబాద్ పోలీసులు నిర్ధారించుకున్నారు.

కారు స్టీరింగ్‌ వద్ద వైర్లు తెగడం వల్లే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఏసీ వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. ఆపై డీజిల్‌ ట్యాంక్‌ పేలిందని అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడంతో కారు డోర్లన్నీ బిగిసుకుపోయి, అందులోనే చిక్కుకుని సుధీర్‌ ప్రాణాలు వదిలినట్టు అనుమానిస్తున్నారు. హోండా అమేజ్‌ కారులో స్టీరింగ్‌ వద్ద వైర్లు తెగినా, ఇతర సమస్యలు వచ్చినా కారు డోర్లు బిగిసుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా చిన్నపాటి పొరపాటుకు ఓ నిండు ప్రాణం బలైంది.

ఇదిలావుంటే, అధికారిక సమాచారం కోసం శంషాబాద్‌ పోలీసులు.. ఆర్టీఏ అధికారులు, హోండా సంస్థ ప్రతినిధులకు లేఖలు రాయనున్నట్టు సమాచారం. అగ్నిమాపకశాఖ నివేదిక వచ్చాక ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కారులో మంటలు, పొగలు వస్తున్నట్టు గమనించినా, కాలిన వాసన వచ్చినా అప్రమత్తం కావాలని పోలీసులు చెప్తున్నారు. డోర్‌లు బిగిసుకుపోతే సీట్‌ బెల్టు బకెల్‌ సాయంతో అద్దాలను పగుల గొట్టాలని సూచిస్తున్నారు.కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.

Read Also… Indian kidnapped in Kabul video: కాబూల్‌లో ఇండియన్‌ వ్యాపారి కిడ్నాప్‌.. నడిరోడ్డుపై తుపాకులతో బెదిరించి…(వీడియో)