Latest crime news: పండగ పూట వారి కుటుంబంలో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లో గాలిపటం ఎగరేస్తూ భవనం పై నుంచి పడి ఒకరు మృతిచెందారు. స్థానికంగా జరిగిన ఈ ఘటన అందరిని కలిచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిక్కడపల్లిలో నివసించే బంగారు కృష్ణ పండుగ సందర్భంగా మూడంతస్తుల భవనంపై స్నేహితులతో కలిసి గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. పక్కింటి ప్రహరీకి ఉన్న ఇనుప చువ్వలు పొట్టలోకి గుచ్చుకెళ్లడంతో తీవ్ర ఆర్తనాదాలు చేశారు. స్థానికులు గమనించి వెంటనే 108కు ఫోన్ చేస్తే గంటసేపైనా అంబులెన్స్ రాలేదు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో గాయపడిన ఆయనను బయటికి తీశారు. అప్పటికే బాగా రక్తస్రావమైంది. ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మార్గమధ్యలో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది.