ఒడిషా (Odisha) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, భద్రతా దళాలే లక్ష్యంగా కలహండి జిల్లా (Kalahandi district) లో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ జర్నలిస్ట్ మృతి చెందాడు. కాగా కలహండిలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటిని బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో పోస్టర్రలు, బ్యానర్లను ఏర్పాటుచేశారు. కాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ప్రచురితమయ్యే ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు రోహిత్ కుమార్ బిస్వాల్(46). ఈక్రమంలో మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు మావోయిస్టులు అతికించిన పోస్టర్లు, బ్యానర్లను పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ పాతిపెట్టిన ఐఈడీ బాంబు పేలడంతో రోహిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని ఎస్పీ వివేక్ తెలిపారు.
పోలీసులే లక్ష్యంగా..
కాగా పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బాంబులు అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా రోహిత్ మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. రోహిత్‌కుమార్ కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటిస్తున్నట్లు సీఎం తెలిపారు . కాగా ఇలాంటి పోస్టర్లు, బ్యానర్లు కనిపించినప్పుడు పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని బాంబు డిస్పోజబుల్ టీమ్స్ తో జల్లెడ పడతాయి. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకు వెళతారు. అయితే రోహిత్ విషయంలో ఇది జరగలేదు. భద్రతా దళాలు వెళ్లే లోపే రోహిత్ అక్కడకు చేరుకోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఒడిశా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం మావోయిస్టుల దుశ్చర్యను ఖండించింది. మావోల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో పని చేసే జర్నలిస్టులకు సరైన భద్రత కల్పించాలని కోరింది.
Health Tips: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి..!
Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ బడ్జెట్‌లోనే..