రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అమాయకులను మాటల్లో పెట్టి బోల్తాకొట్టించి కష్టపడిన సొమ్మును సులువుగా దోచేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని కటక్‌లో ఇద్దరు వైద్యులపై తమ ప్రతాపం చూయించారు. ఓటీపీ అడిగా ఏకంగా కోటికి పైగా దోచేసారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. వారు తెలిపిన వివరాల ప్రకారం..
కటక్ సీడీఏ ప్రాంతంలో ఉంటున్న విశ్రాంత వైద్యుడు మహంతికి ఈ నెల 9వ తేదీన ఫోన్‌కాల్ వచ్చింది. మీ సెల్‌ఫోన్‌లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కేవైసీ చేయలేదని, బ్లాక్ చేస్తామని ఫోన్‌లో చెప్పారు. అలా కాకుండా ఉండాలంటే వెంటనే కేవైసీ అప్‌డేట్ చేయాలని సూచించారు. కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, తాము పంపించే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కేవైసీ చేసుకోవచ్చని చెప్పారు. దీంతో వారు చెప్పినట్లు ఆయన యాప్ డౌన్‌లోడ్ చేశారు. అందులో ఏటీఎం కార్డు నెంబరు లోడ్ చేయాలని సూచించారు. అలా నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఆయన ఫోన్‌కు ఓటీపీ వచ్చింది. ఓటీపి నెంబరు చెప్పాలని ఫోన్ చేసిన వ్యక్తి కోరడంతో వైద్యుడు నెంబరు చెప్పారు. ఆరోజు సాయంత్రానికి ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. దీంతో వైద్యుడు మరునాడు బ్యాంకుకి వెళ్లి ఏటీఎం కార్డు బ్లాక్ అయిన విషయం బ్యాంకు అధికారులకు తెలిపాడు. మరో కొత్త ఏటీఎం కోసం దరఖాస్తు నింపి ఇవ్వాలని, వారం రోజుల్లోగా ఏటీఎం కార్డు ఇంటికి వస్తుందని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇంటికి వచ్చేసిన వైద్యుడు బుధవారం డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఆయన ఖాతా నుంచి రూ.77,86,727 మాయమైనట్లు తెలుసుకొని బ్యాంకు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే, తన ఖాతా నుంచి రూ.52 లక్షలు మాయమైనట్లు మరో ఆయుర్వేద వైద్యుడు ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నైజీరియాకు చెందిన బీమా సంస్థ ఎక్కువ మొత్తం ప్రలోభ పెట్టడంతో ఆయుర్వేద వైద్యుడు తొలుత రూ.30 లక్షలు తన ఖాతా నుంచి బీమా సంస్థకు బదిలీ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఆయన తన బ్యాంకు ఖాతా పరిశీలించగా బదిలీ చేసిన మొత్తం కాకుండా మరో రూ.22 లక్షలు బీమా సంస్థకు అదనంగా బదిలీ అయినట్లు తేలింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tiger Roaming Villages : గ్రామాల్లో సంచరిస్తున్న పెద్దపులి.. పశువులపై దాడి.. వణికిపోతున్న జనాలు..