Government teacher Saraswati set ablaze : హైదరాబాద్ వనస్థలిపురంలో సర్వస్వతి అనే గవర్నమెంట్ టీచర్ అగ్నికి ఆహుతైన కేసు కొత్త మలుపు తిరిగింది. సరస్వతి ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదంలో చనిపోలేదని.. ఆమె భర్తే సరస్వతికి నిప్పంటించి చంపాడని ఆరోపణలు తీవ్రమయ్యాయి . ఆస్తి కోసం భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా తన తల్లిని తండ్రి వేధిస్తున్నాడంటున్న కూతురు కూడా చెప్పడంతో సరస్వతి చావుకి భర్తే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇలా ఉండగా, సరస్వతి దహనం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని ముందు అంతా భావించారు. కానీ తాళికట్టిన భర్తే ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసినిప్పంటించాడని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన చెల్లం బాలకృష్ణ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అతని మొదటి భార్య చనిపోవడంతో నల్గొండ జిల్లా డిండి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఎర్ర సరస్వతి (42)ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల వివాహం జరిగి 20 ఏళ్లు కావొస్తోంది. అనంతరం సరస్వతికి ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు.
బాలకృష్ణ మొదటి భార్యకు కుమారుడు వెంకటరమణ జన్మించగా, సరస్వతికి కూతురు అక్షిత (15) ఉంది. ఈ క్రమంలో వనస్థలిపురంలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న ఇల్లు సరస్వతి పేరు మీద ఉండగా.. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని బాలకృష్ణ కొంతకాలంగా భార్య సరస్వతిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయమై ఆదివారం రాత్రి కూడా భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారని కూతురు అక్షిత పోలీసులకు చెప్పింది. సోమవారం ఉదయం కూడా మళ్లీ గొడవ పడ్డారని, తల్లిని తన తండ్రి బాలకృష్ణ కొట్టారని కూతురు అక్షిత పోలీసులకు వివరించింది. తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన తండ్రి టిఫిన్ తీసుకొచ్చారని, ఆ తర్వాత తాను ఆన్‌లైన్ క్లాస్‌లు వినేందుకు బెడ్‌రూంలోకి వెళ్లానని అక్షిత పోలీసులకు వెల్లడించింది.
అయితే, కొంచెంసేపటికి తర్వాత పెద్ద శబ్దం రావడంతో తాను బయటకి వచ్చి చూడగా….తన తల్లి మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయి కన్పించిందని, తనను దగ్గరకు రావొద్దని చెప్పిందని కూతురు అక్షిత తెలిపింది. అయితే, తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతురాలి భర్త బాలకృష్ణ స్వల్పగాయాలతో 108లో యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల చెప్పారు. తమ చెల్లెల్ని ఆమె భర్త బాలకృష్ణ హత్యచేసి..ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి అక్కలు సులోచన, వెంకటమ్మ, రమణలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.