తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫేక్ డీఎస్పీ నెల్లూరు స్వామికి డిపార్ట్‌మెంట్ నుంచే సహకారం అందిందా? గతంలో పోలీస్ టోపీ, లాఠీతో అడ్డంగా దొరికినా.. వదిలేశారా? అది తెలిసే జరిగిందా? అనుకోకుండా జరిగిపోయిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నకిలీ డీఎస్పీ నెల్లూరుస్వామి అరెస్ట్ అనంతరం చేస్తోన్న విచారణలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదు నెలల క్రితం కామారెడ్డిలో మద్యం సేవించి హల్‌చల్ చేసిన స్వామిని.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో లోపలేశారు. ఆ సమయంలో అతని కారులో టోపీ, లాఠీ లభించాయి. వాటిపై అంతగా ఫోకస్ చేయలేదు పోలీసులు. ఆ తర్వాత అతను మరింత రెచ్చిపోయాడు. భారీ సెటిల్‌మెంట్లకు తెరలేపాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలకు లక్షలు వసూలు చేశాడు. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు తన మోసాలను విస్తరించిన నెల్లూరు స్వామి.. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సెటిల్‌మెంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. అతని బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కేటుగాడికి సహకరించిన వారిపాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని బేగంబజార్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ రవి చెప్పారు.
Also Read: ఈమె లేడీ కాదు…కిలాడీ.. నాలుగు పెళ్లిళ్లు.. ఎన్నో మోసాలు