ఎన్నికలు వచ్చాయంటే గ్రామాల్లో పండగే.. మందు.. విందు.. అంతకంటే నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి పంపకాలు. పోటీ చేసిన అభ్యర్థి ఒకరు బీరు.. బిర్యాణీ.. పంచితే.. మరొకరు నోట్ల కట్టలు పంచడం కామన్.. మనం ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ పోలింగ్‌కు ముందు రోజు చూసి ఉంటాం.. పోలింగ్ జరగనున్న కొద్ది గంటల ముందు వందల కోట్ల రూపాయల నగదు, బంగారం భారీగా పట్టుబడింది. ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నగదు రూ.225.5 కోట్లతోపాటు సుమారు రూ.176 కోట్ల విలువైన బంగారాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. వాటితో పాటు భారీగా మద్యం, గృహోపకరణాలను కూడా అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా రూ.428 కోట్లు ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. ఇదంతా ఇలావుంటే ఉత్తర ప్రదేశ్‌లో పట్టుబడినవి తెలిస్తే అంతా షాక్ అవుతారు.
అక్కడ జరగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు నిల్వ ఉంచిన జిలేబీలు, సమోసాలు పట్టుకున్నారు అక్కడి పోలీసులు. అవును ఇది నిజం. మీరు చదవింది వందకు వంద శాతం నిజం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తయారు చేసిన 200 కేజీల జిలేబీలు, 1,050 సమోసాలను పోలీసులు పట్టుకున్నారు.
వాటిని చేసిన వంటవారిని పట్టుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. పది మందిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.
హసంగంజ్‌కు చెందిన ఒక అభ్యర్థి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వీటిని రెడీ చేశాడు. పంపిణీ చేసేందుకు భారీగా జిలేబీలు, సమోసాలు తయారు చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ అభ్యర్థి ఇంట్లో సోదాలు చేశారు. అప్పుడే వండి పంపిణీ కోసం ప్యాక్ చేసిన 200 కేజీల జిలేబీలు, 1,050 సమోసాలు, భారీగా మైదా, నెయ్యి, స్టవ్, గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పది మందిని అరెస్ట్ చేయడంతోపాటు కరోనా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనపై కేసు నమోదు చేశారు.