Vizianagaram Minor girl Rape: సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అమ్మ – నాన్న తరువాత ఆడబిడ్డలకు అండగా ఉండేది అమ్మలో సగం, నాన్నలో సగమైన అన్నా అంటారు. అలాంటిది అన్నానే కాటు వేస్తే.. అభం శుభం తెలియని అమాయకురాలైన మైనర్ బాలికను చిదిమేస్తే.. ఇక, రక్షణ ఎక్కడుంది.. ఇలాంటి నీచమైన పని ఒకటి విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
బాలికపై సోదరుడి వరుసైన చిన్నాన్న కుమారుడే అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు…విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఓ గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 21 నుంచి కనిపించకుండా పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డారు. దీంతో తల్లిదండ్రులు డెంకాడ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేసి బాలిక ఆచూకీని కనుగొన్నారు. పోలీసుల దర్యాప్తులో షాక్‌కు గురిచేసే అంశాలను గుర్తించారు.
బాధిత బాలికపై చిన్నాన్న కుమారుడు కన్నేశాడు. దీంతో నాలుగు నెలల కిందట కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ పరువుపోతుందని ఆమె ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచేసింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. మూడు నెలల గర్భిణి అని తేలడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చిన్న వయసు కావడంతో గర్భస్రావం అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు బయటకు పొక్కనీయలేదు. అప్పటి నుంచి నిందితుడు గ్రామంలో కనిపించకుండాపోయాడు. విశాఖలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఇటీవలే తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. అతనిని చూసిన బాధిత బాలిక భయాందోళనకు గురై పరారైంది. ఆరా తీసిన కుటుంబసభ్యులకు అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులకు ఫిర్యాద చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ తేలడంతో కేసును డెంకాడ పోలీసులు దిశ పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.